NTV Telugu Site icon

Shanti Kumari : నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి

Cs Shanti Kumari

Cs Shanti Kumari

వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సిజిఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. CGMలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. అదే విధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను హెచ్చరించారు. సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ, మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

Show comments