NTV Telugu Site icon

CS Shanti Kumari : అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

Shanti Kumari

Shanti Kumari

జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. జూన్ 2 వ తేదీన ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సి.ఎస్ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, పరేడ్ గ్రౌండ్ లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు, సందేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనితో పాటు, శిక్షణ పొందుతున్న 5000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్ తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు.

ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాలచే తయారు చేసిన పలు వస్తువుల లతో పాటు నగరంలోని పేరొందిన హోటళ్ళచే ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నగరపౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోద శాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణసంచా ప్రదర్శనతో పాటు లేజర్ షో ఏర్పాటుచేశామని శాంతి కుమారి వివరించారు. రాష్ట్ర అవతరణ సందర్బంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని తెలిపారు.