NTV Telugu Site icon

CS Shanti Kumari : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలి

Cs Shanti Kumari

Cs Shanti Kumari

పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు . సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్, పింగాణీ వస్తువులను ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంపై డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఈరోజు ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. వర్క్‌షాప్‌లో ప్రభుత్వ సలహాదారు, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ రాజీవ్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీ చేసినందున, సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటించి ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్వలు, చెరువులు, నదీ జలాల్లోకి చేరి మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తున్నారు.

సచివాలయంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించడం ద్వారా ప్రతి అధికారి, ఉద్యోగి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్బోధించారు. వాటర్ బాటిళ్లు, కవర్లు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, స్ట్రాల్లో ప్లాస్టిక్ వాడుతున్నారని, వీటికి బదులు స్టీలు, పింగాణీ వస్తువులు వాడాలన్నారు. ఇది ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మాత్రమే సాధ్యం కాదు, కానీ సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా అనుసరించాలి.

Show comments