బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అర్రాలో దుండగుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. తాజాగా.. దుండగులు ముగ్గురు స్నేహితులను కాల్చారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
Read Also: Advocate Murder : అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్య కేసులో వీడిన మిస్టరీ
ఈ ఘటన అర్రా పట్టణంలోని రామ్‌గరియా ప్రాంతంలో చోటు చేసుకుంది. రామ్‌గరియా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ముగ్గురు యువకులపై దుండగులు తుపాకులతో దాడి చేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు పాత కక్షలు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బాధితులు గతంలో దుండగులతో గొడవ పడ్డారని తెలిపారు. మద్యం విషయం ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Manoj Bharathi Raja : పరిశ్రమలో విషాదం.. స్టార్ డైరెక్టర్ కుమారుడు మృతి
కాగా.. గాయపడిన ఓ వ్యక్తి మాట్లాడుతూ మద్యం అమ్మకం విషయంలో గతంలో విభేదాలు జరిగాయని చెప్పాడు. ఆ ఘటనల కారణంగా తమపై అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారని తెలిపాడు. ఈ ఘటనపై అరా అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిశీలిస్తున్న పోలీసులు, దుండగుల వివరాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు.. కాల్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.