Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..

Tilak Ji

Tilak Ji

భారత యువ సంచలనం, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ క్రికెటర్, రాజకీయ వేదికపై కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. తిలక్ వర్మ అత్యంత ఆప్తమిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర కొత్త ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిలక్ వర్మ ప్రత్యేకంగా హాజరై, తన స్నేహితుడిని కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

మైదానంలో విధ్వంసం.. మరుసటి రోజే అసెంబ్లీలో ప్రత్యక్షం..
ఈ పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే తిలక్ వర్మ క్రికెట్ మైదానంలో వీరోచిత ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచారు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తెలంగాణ టీ20 (TG20) లీగ్‌లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్‌గా లీడ్ చేస్తూ వరంగల్ వారియర్స్ విధించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో కరిగించారు. కేవలం 56 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 136 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

×
×
Ad

ఆదివారం ఇండియా-ఎ జట్టును టైటిల్ విజేతగా నిలిపి, సోమవారం లోకల్ లీగ్‌లో సెంచరీ బాదిన తిలక్, మంగళవారం నాటికి తన బిజీ షెడ్యూల్ నుంచి సమయాన్ని కేటాయించి ముంబై చేరుకోవడం విశేషం. త్వరలోనే భారత జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న తిలక్, వెళ్లేముందు తన స్నేహితుడి జీవితంలోని అతిపెద్ద విజయ గమనంలో భాగస్వామి కావడం వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని చాటిచెబుతోంది.