Haryana Cow Gives 80 Liter Milk Per Day: భారత దేశంలో పాల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలలో హర్యానా ఒకటి. హర్యానాలో పశువుల పెంపకదారులు చాలా ఎక్కువ. పశుపోషణలో వారికి మంచి నైపుణ్యం ఉన్న కారణంగా.. అక్కడి ఆవులు లేదా గేదెలు చాలా ఎక్కువగా పాలు ఇస్తుంటాయి. కొన్ని జాతుల ఆవు లేదా గేదెలు 30-60 లీటర్ల పాలు కూడా ఇస్తుంటాయి. అయితే కర్నాల్ జిల్లాలోని ఝిఝారీ గ్రామంలోని ఓ ఆవు ఒకే రోజులో 80 లీటర్ల పాలు ఇచ్చి రికార్డు నెలకొల్పింది. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే ఒక రోజులో అత్యధిక మొత్తంలో పాలను ఇచ్చిన ఆవుగా రికార్డుల్లో నిలిచింది.
ఝిఝారీ గ్రామ నివాసితులు సునీల్ మెహ్లా, సంకి మెహ్లా అనే ఇద్దరు సోదరులు ‘షకీరా’ అనే ఆవును పెంచుతున్నారు. తాజాగా కురుక్షేత్రలో డెయిరీ అసోసియేషన్ నిర్వహించిన ‘మిల్కింగ్ ఛాంపియన్’ పోటీలో షకీరా పాల్గొంది. 8 గంటల విరామం ఇస్తూ.. రోజులో మూడుసార్లు యంత్రాల ద్వారా ఆవుకు పాలు పితికారు. షకీరా 80 లీటర్ల 756 గ్రాముల పాలను ఇచ్చింది. దాంతో తొలి స్థానంలో నిలిచిన షకీరా.. రికార్డుతో పాటు బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకుంది.
Also Read: Girl Delivers Baby: ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ.. బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్ధిని!
సునీల్ మెహ్లా మాట్లాడుతూ… ‘మేము 12 ఏళ్లుగా పశువులను పెంచే వ్యాపారం చేస్తున్నాం. ప్రస్తుతం మా పొలంలో 120 పశువులు ఉన్నాయి. తరతరాలుగా మా కుటుంబంకు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారం. షకీరా వయస్సు 6 సంవత్సరాలు. ఈ ఆవును సాధారణ ఆవులతోనే పెంచుతాం. పోటీలో పాల్గొనే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఎక్కువ నీరు పెడుతాం. ఈ ఆవు గతంలో 24 గంటల్లో 72 లీటర్ల పాలు ఇచ్చి రికార్డు సృష్టించింది. ఈసారి 80 లీటర్ల పాలను ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. పాల ఉత్పత్తి సామర్థ్యం కారణంగా ఈ జాతి ఆవులను ఎక్కువగా పెంచాలని చుస్తునారు’ అని తెలిపాడు.