NTV Telugu Site icon

Harassment Allegations: క్రీడా మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. విచారణ చేపట్టిన పోలీసులు

Sandeep Singh

Sandeep Singh

Harassment Allegations: హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గురువారం ఈ ఆరోపణ చేయగా, ఒక రోజు తర్వాత ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది.అయితే మంత్రి ఈ ఆరోపణలను నిరాధారమైనదని తోసిపుచ్చారు. దీంతో పాటు స్వతంత్ర విచారణకు పిలుపునిచ్చారు.

“ఫిర్యాదు దాఖలు చేయబడింది. అన్ని కోణాల్లో విచారణ నిర్వహించబడుతుంది” అని హర్యానా క్రీడా విభాగంలో కోచ్ అయిన మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. తన ప్రతిష్టను దిగజార్చినందుకు ఆమెపై ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత సందీప్ సింగ్ కూడా చెప్పారు. హర్యానా క్రీడామంత్రి సందీప్ సింగ్ నుంచి కూడా ఫిర్యాదు స్వీకరించబడిందని అదనపు డీజీపీ మమతా సింగ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తుకు అదనపు డీజీపీ నేతృత్వంలో హర్యానా డీజీపీ పీకే అగర్వాల్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఆరోపణలు సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో పంచకుల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమేర్ పర్తాప్ సింగ్, పంచకుల అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్ కౌశిక్ సభ్యులుగా ఉన్నారు.

ఆ మహిళ శుక్రవారం లైంగిక ఆరోపణల గురించి ప్రస్తావించింది. తాను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఎస్పీ)కు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. తనకు న్యాయం జరుగుతుందని, చండీగఢ్ పోలీసులు తన ఫిర్యాదును విచారిస్తారని ఆశిస్తున్నానని పేర్కొంది. హాకీ మాజీ కెప్టెన్, హర్యానా క్రీడామంత్రి సందీప్ సింగ్ తనను మొదట జిమ్‌లో చూశారని, ఆపై తనను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించారని ఆమె ఆరోపించింది. తన నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో కలవాలనుకున్నానని ఆ కోచ్ వెల్లడించింది. మంత్రిని ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు, తనపై లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని మహిళ తెలిపింది.

Scavenger As Deputy Mayor: చరిత్ర సృష్టించిన చింతాదేవి.. డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు

“అతను నన్ను తన నివాసంలోని ఒక పక్క క్యాబిన్‌కి తీసుకెళ్లాడు. అతను నా పత్రాలను సైడ్ టేబుల్‌పై ఉంచాడు. నా పాదాల మీద చేయి ఉంచాడు, అతను నన్ను మొదటిసారి చూసినప్పుడు ఇష్టపడ్డానని చెప్పాడు. నువ్వు నన్ను సంతోషంగా ఉంచు నేను నిన్ను సంతోషంగా ఉంచుతాను” అని ఆయన తనతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆ మహిళ ఆరోపించింది. “నేను అతని చేతిని తీసివేసాను… అతను నా టీ-షర్టును కూడా చించివేసాడు. నేను ఏడుస్తున్నాను. నేను సహాయం కోసం అలారం మోగించాను. అతని సిబ్బంది అంతా అక్కడ ఉన్నప్పటికీ, ఎవరూ నాకు సహాయం చేయలేదు,” ఆమె ఆరోపించింది. ఆరోపణలపై సందీప్ సింగ్‌ను గురువారం ప్రశ్నించగా, వాటిని నిరాధారమైనవిగా అభివర్ణించారు. స్వతంత్ర దర్యాప్తుకు పిలుపునిచ్చారు. మహిళ జీవితానికి సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించాలని మంత్రి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా మహిళ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేయగా, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే సందీప్ సింగ్‌ను బర్తరఫ్ చేసి, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ డిమాండ్ చేసింది.