Site icon NTV Telugu

Contract Lecturers: గాంధీభవన్‌ ముట్టడించిన కాంట్రాక్ట్ లెక్చరర్లు

Lecturers

Lecturers

Contract Lecturers: తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌ను ముట్టడించారు. మొత్తం 12 విశ్వవిద్యాలయాల్లో సుమారు 1,400 మంది కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ సామర్ల విజయేందర్ రెడ్డి నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాటలను మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా, ఈ విషయంపై ఏ ఆలోచన కనిపించడం లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్ట్ టీచర్లు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారని, తమ కుటుంబాలను పోషించలేని దుస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, అందుకే చివరికి రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, తమ హామీలను నిలబెట్టుకుని యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. లేకపోతే, తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Exit mobile version