సంకల్ప బలముంటే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చంటుంటారు. గర్భం ధరించిన మహిళలు ఏమీ చేయలేరనే భావనలను తలక్రిందులు చేస్తూ, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 7 నెలల గర్భిణిగా ఉండి, 145 కిలోల బరువును ఎత్తి వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సోనికా యాదవ్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టినప్పుడు, ఆమె చరిత్ర సృష్టించబోతోందని ఎవరూ ఊహించి ఉండరు.
Also Read:Declared Dead Alive: రోగి చనిపోయినట్లు ప్రకటించిన వైద్యులు.. కానీ 15 నిమిషాల తర్వాత అద్భుతం..
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 145 కిలోల బరువును ఎత్తి మహిళా శక్తిని నిరూపించారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె, గర్భధారణ సమయంలో కూడా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంది. డాక్టర్ల సలహాతో, సురక్షితంగా శిక్షణ తీసుకుంటూ వచ్చింది. తన గర్భధారణ కాలం అంతా వెయిట్ లిఫ్టింగ్ కొనసాగించానని సోనికా వెల్లడించింది. ఆ ధైర్యమే ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలవడానికి సహాయపడిందని ఆమె అన్నారు. పోటీలో, ఆమె స్క్వాట్స్‌లో 125 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 80 కిలోలు, ఆపై డెడ్‌లిఫ్ట్‌లో 145 కిలోలు ఎత్తింది.
లూసీ మార్టిన్స్ అనే మహిళ తన గర్భధారణ సమయంలో ఇలాంటిదే చేసిందని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశానని సోనికా తెలిపింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లూసీని సంప్రదించి ఆమె నుండి శిక్షణ చిట్కాలను కూడా తీసుకున్నట్లు తెలిపింది. మొదట్లో, సోనికా గర్భవతి అని ఎవరికీ తెలియదు. కానీ నిజం బయటపడగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఇతర జట్ల మహిళా పోలీసు అధికారులు ఆమెను అభినందించడానికి వచ్చి ఆమెతో ఫోటోలు దిగారు. సోనికా 2014 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో, ఆమె మజ్ను కా తిలా ప్రాంతంలో బీట్ ఆఫీసర్‌గా పనిచేశారు.
Delhi Police constable, 7 months pregnant, lifts 145kg to clinch stunning medal in Weightlifting Championshiphttps://t.co/U503NsRHuv pic.twitter.com/OrsvoXgjWt
— NDTV Sports (@Sports_NDTV) October 27, 2025
