Renuka Chowdary: రాష్ట్రంలో తాను చెప్పిన జోస్యం ప్రకారం అప్పటి మంత్రి అజయ్ తూడుచుకుపోతాడు అన్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి వెల్లడించారు. అదే జరిగిందని ఆమె తెలిపారు. ఈ జిల్లాకు స్వేచ్ఛ వచ్చిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు. ఇక నుంచి తాను బస్సులోనే తిరుగుతానన్నారు. ఆర్టీసీ బస్ ప్రయాణం హాయిగా ఉందన్నారు. ఇంకా 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు తనతో చెప్తున్నారని రేణుకా చౌదరి వెల్లడించారు. అంచెలంచెలుగా రైతుబంధు పడుతుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామన్నారు.
రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలు స్వేచ్ఛగా ప్రశ్నించగలుగుతున్నారన్నారు. ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు రావడం అదృష్టమన్నారు. ఈమె లోకల్ కాదు అని చాలా మంది అన్నారని ఆమె వ్యాఖ్యానించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మత్స్య శాఖను అభివృద్ధి చేశానని, పాలేరులో రీసెర్చ్ స్టేషన్ పెట్టించానని, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు కోసం ప్రణాళికలు ఏర్పాటు చేయించానని ఆమె వెల్లడించారు. 350 మంది రైతులకు వ్యవసాయ రంగంలో నూతన పద్దతులపై ఢిల్లీకి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించానన్నారు. మామిడి తోటలు నరికి ఆయిల్ ఫాంలు వేస్తున్నారన్నారు. కేవలం లాభాల కోసం అలాంటి పంటలు వేయవద్దన్నారు. జామాయిల్ కూడా వేస్తున్నారని, అది దారుణమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. ఏ పని అయినా లోతుగా అన్వేషణ చేస్తారన్నారు. అజయ్ కు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని పేర్కొన్న రేణుకా చౌదరి.. ఆయన తినే ప్రతి మెతుకు తనదేనన్నారు. ఆయన వల్ల ప్రజల్లో తిరుగుబాటు వచ్చి మమ్మల్ని గెలిపించారన్నారు. మాకు కక్ష్యా రాజకీయాలకు టైం లేదు, అలా చేయం కూడా అని ఆమె స్పష్టం చేశారు. కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెట్టారన్నారు.
Read Also: Etela Rajender: మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడిగా..
తన హయాంలో స్థంబాద్రి ఉత్సవాలు జరిగేవని.. ఇప్పటి మంత్రులు తరుణి హాట్ ను పునః ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. ఖిల్లాను అభివృద్ధి చేసి టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేయాలని.. ఖమ్మంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎంసెట్ పరీక్షా కేంద్రాన్ని తెచ్చానని.. ఖమ్మంకు ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ఇప్పించగలిగానన్నారు. తద్వారా దేశానికి యువత రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. గుండాల ప్రాంతానికి వెళ్లిన మొట్టమొదటి ప్రజా ప్రతినిధిని తానేనన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారి కృషితో గుండాల లాంటి మారుమూల ప్రాంతాలకు రోడ్లు పడ్డాయన్నారు. మనకు రావాల్సిన బొగ్గు గుజరాత్‌కు వెళుతుందని పోరాడానన్నారు. పాల్వంచలో స్పాంజ్ ఐరన్ నిలబడింది అంటే కాంగ్రెస్ వల్లనే అని పేర్కొన్నారు. భద్రాచలం రాముల వారి భూముల విషయం సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. పోయిన 7 మండలాలను కూడా వెనక్కు తెచ్చుకునే ప్రయత్నం చేస్తామన్నారు. 22 న అయోధ్యలో రాముల వారి ప్రతిష్టను వ్యతిరేకించిన వారికి మద్దతు ఇస్తామన్నారు. గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రతిష్ట ఏంటి అంటూ ఆమె ప్రశ్నించారు. మీరు ఆహ్వానిస్తే రావాలా.. తన హృదయంలో ఎపుడూ కోరిక కలిగితే అపుడు వెళతామన్నారు. మేం హిందువులం.. మీ పిలుపు మాకు అవసరం లేదన్నారు. అయోధ్య రామ మందిర వ్యవహారాన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.