మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నుండి స్వాతంత్రం పొంది హైదరాబాద్ భారత్‌లో విలీనం అయిందని, నెహ్రు కాలంలో చివరగా లొంగిపోయింది నిజాం అని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. నెహ్రు సూచనలు మేరకు పటేల్ హైదరాబాద్ వచ్చారని, తలవంచి నేను విలీనం చేస్తున్న అని నిజాం నవాబు చెప్పారన్నారు. ఇక్కడ భూములు జమీందారుల చేతిలో ఉండేవని, జమీందారు వ్యవస్థ రద్దు చేసి నెహ్రు భూ సంస్కరణలు చేశారన్నారు. బీజేపీ సెంటిమెంట్‌తో పని చేస్తోందని ఆయన ఆరోపించారు. గుడి, మతం, ప్రాంతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలు గుర్తు చేయకుండా మీరు ఉత్సవాలు జరుపుకోవడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కు ఎన్నో కేంద్ర సంస్థలు తెచ్చి ఎన్నో ఉద్యోగాలు కల్పించామన్నా కోదండరాం.. ఇప్పుడు నిరుద్యోగ యువత, బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వాటి గురించి కాకుండా సెంటిమెంట్‌తో ఆడుకోవడం రెండు ప్రభుత్వాలకు సరైంది కాదని హెచ్చరించారు. 1969 లో ఇందిరా గాంధీ హయాంలో తెలంగాణ ఉద్యమం వస్తే ఆమె హైదరాబాద్ వచ్చి ఇక్కడ న్యాయం చేయడానికి ఎన్నో పరిశ్రమలు స్థాపించారన్నారు. తెలంగాణ విలీనం, విమోచనం పేరుతో రాజకీయం చేయద్దని విజ్ఞప్తి చేశారు.
