Telangana Assembly Elections: ఉత్కంఠ రేపిన కాంగ్రెస్ రెండో జాబితా ఎట్టకేలకు విడుదల అయ్యింది. 45 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించింది హైకమాండ్. తీవ్ర కసరత్తు, వడపోతల తర్వాత అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించింది. మొదట 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. తాజా లిస్ట్‌తో ఇప్పటి వరకు మొత్తం వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. కమ్యూనిస్టులకు నాలుగు సీట్లు ఇచ్చేందుకే ఓకే చెప్పింది. ఇక మిగితా 15 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. రెండో జాబితాలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా.. ముఖ్యమైన స్థానాల్లో కీలక నేతలకు అవకాశం కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికొస్తే పీజేఆర్ వారసుల్లో ఆయన కుమార్తె విజయారెడ్డికి ఖైరతాబాద్ సీటు ఇచ్చి, కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డికి టిక్కెట్ నిరాకరించింది. గద్దర్ వారసుల్లో కొడుకు సూర్యం బదులు కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేటాయించింది. జూబ్లిహిల్స్ నుంచి అజారుద్దీన్‌ను బరిలోకి దింపుతోంది. ఇటీవల పార్టీలో చేరిన జగదీశ్వర్ గౌడ్ కు శేరిలింగంపల్లి, బండి రమేష్‌కు కూకట్‌పల్లి టికెట్ ఇచ్చింది.
బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు సీటు ఇచ్చింది. అంటే ఆ ఇద్దరు నేతలు కోరుకున్న స్థానాలనే ఇచ్చింది. అంతే కాకుండా.. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు టికెట్ ఇచ్చింది, అలాగే.. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల, ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్‌మోహన్‌రావుకు ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్‌కు అసిఫాబాద్ సీటు కేటాయించింది. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి మహేశ్వరం, మల్‌రెడ్డి రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం, సీటు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఉపఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అవకాశం దక్కించుకున్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసిన పాల్వాయి స్రవంతిని ఈసారి పక్కనపెట్టేసింది అధిష్ఠానం.
మరోవైపు.. ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్‌కు కూడా ఈసారి అవకాశం కల్పించలేదు. మరోవైపు.. ఇంకా 19 స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. అందులో సీపీఐ, సీపీఎంకు సీట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో రెడ్డిలకు 37 స్థానాలు కేటాయించింది. ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, బీసీలకు 18 సీట్లు ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న సీట్లపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఆ సీట్లలో కూడా కొందరికి నిరాశే మిగిలే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. గెలుపు గుర్రాల కోసం చివరి క్షణం వరకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి కనిపిస్తోంది.. సామాజిక న్యాయంపై ఫోకస్ పెట్టలేదని ఆరోపణ వినిపిస్తు్న్నాయి.. నిన్నటి వరకు తిట్టిన నేతలకు కూడా టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ మరికొందరు మండిపడుతున్నారు..