రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జోధ్‌పూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ఈరోజుల్లో పిల్లలందరూ తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి? అదేమంత పెద్ద విషయం కాదు. నా మేనల్లుడిని తక్షణమే విడుదల చేయండి’ అంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు.
అయితే నిందితుడిని విడిచిపెట్టేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ తన భర్త ఉమైద్ సింగ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించారు. అనంతరం ఉమైద్ సింగ్ కొందరు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ‘నిన్నే కొందరు పోలీసులు ఈ పోలీస్ స్టేషన్ నుంచి సస్పెండ్ అయిన సంగతి మరిచిపోయారా అంటూ పోలీసులను హెచ్చరించారు. ఈ తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో లా అండ్ ఆర్డర్ ఇలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ జోక్యం చేసుకోవడంతో సీజ్ చేసిన ఎమ్మెల్యే మేనల్లుడి కారును పోలీసులు తిరిగి అప్పగించారు.