Revanth Reddy Birthday Wishes: మనలో చాలామంది.. వారికి ఇష్టమైన వారి పుట్టినరోజు లేదా ఏదైనా ముఖ్యమైన రోజున శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అందులో చాలాతక్కువ మంది ఎదుటివారి జీవితాంతం గుర్తిండిపోయేలా శుభాకాంక్షలు చెబుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో వరి నారును ఉపయోగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఈ నెల 8న సీఎం పుట్టినరోజు నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇందుకోసం దాదాపు 20 రోజులుగా శ్రమించారు.
రైతు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. వరి నారుతో సీఎం రూపాన్ని పొలంలోనే తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ చిత్రపటాన్ని పొలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా మెట్టు సాయికుమార్ చేపట్టిన ఈ వినూత్న శుభాకాంక్షల కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

