ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుత చర్యల కారణంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్నికలకు సంబంధించిన రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఏకపక్షంగా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా.. కడప కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను ఏకపక్షంగా తొలగించడం లేదా చేర్చడం వంటి చర్యలకు పాల్పడలేదని కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు తెలిపింది. ఓటర్ల జాబితా తయారీలో పాదర్శకత, నిబంధనలు పాటించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో ఓటర్ల తొలగింపులో అవతవకలు జరగలేదన్న ఈసీ.. కాంగ్రెస్ ప్రతినిధుల భాగస్వామ్యంతో పాటు తగిన ప్రక్రియను అనుసరించామని వెల్లడించింది.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత.. ఎన్నికల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. అయితే కాంగ్రెస్ బృందాన్ని పంపిస్తే.. అనుమానాలు నివృత్తి చేస్తామని ఈసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు మధ్యప్రదేశ్‌లో మోడీ పర్యటన.. కెన్-బెత్వా నదుల లింక్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన