NTV Telugu Site icon

congress: మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. వారెవరంటే?

Con

Con

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన హస్తం పార్టీ మూడు స్థానాలపై చాలా రోజులు కసరత్తు జరిపింది. అవి కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు కాగా.. రేపు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం సీటు కోసం రాష్ట్రంలోని చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరకు ఆ సీటును రామసహాయం రఘురామ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి ఎండీ ఉల్లా సమీర్ లను ప్రకటించింది కాంగ్రెస్.

READ MORE: Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..

ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఎవరంటే..
రామసహాయం రఘురాం రెడ్డి 1961, డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. కాగా వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ విద్యను, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు. రఘురాంరెడ్డికి ఇద్దరు కుమారులు. రాజకీయ ప్రస్థానం : రామసహాయం రఘురాంరెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. కాంగ్రెస్ పార్టీలో నిర్వర్తించిన బాధ్యతలు: 1985లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్ సభకు ఇన్ చార్జ్ గా పనిచేశారు. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కలేదు.