Congress: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో.. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పలు మార్లు సమావేశమైన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ).. అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ వస్తుంది.. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.. ఈ రోజు రాత్రికి ఏపీలో కొన్ని స్థానాలకు అభ్యర్ధులను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Read Also: SS Rajamouli Dance: స్టేజ్‌పై స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి దంపతులు.. వీడియో వైరల్!
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ “సీఈసీ” సమావేశం జరగనుంది.. నిన్న రాత్రి మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” సమావేశం అయ్యింది.. సీఈసీ ఆమోదం కోసం ప్రతిపాదించే అభ్యర్ధుల జాబితాపై “స్క్రీనింగ్ కమిటీ” సుదీర్ఘ చర్చలు జరిపింది.. రాష్ట్రంలోని 120 అసెంబ్లీ స్థానాలకు, 20 లోకసభ స్థానాలకు అభ్యర్ధులను సీఈసీకి సిఫార్సు చేసింది ఏపీ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ”. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ఇంచార్జ్ సెక్రటరీ మయ్యప్పన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరా రెడ్డి, సూరజ్ హెగ్డే, కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఏపీ స్క్రీనింగ్ కమిటీ జాబితాను పరిశీలించి, నేడు కాంగ్రెస్ సీఈసీ ఆమోదం తెలపనుంది.. ఇవాళ రాత్రికి ఏపీ అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
