హైదరాబాద్ నలువైపులా నిర్మించే మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుతున్నారన్నారు.
అవగాహన పెరగటం వల్ల 90 శాతం మరణాలు తగ్గాయని… ఎయిడ్స్ బాధితులను చిన్న చూపు చూడడం వద్దని…. ఇప్పటికీ వివక్ష చాలా తగ్గిందన్నారు. గాలి ద్వారా, ముట్టుకుంటే ఎయిడ్స్ రాదని… అవగాహన ఇంకా పెరగాలని సూచనలు చేశారు హరీష్ రావు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7 ఉండేదని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేపట్టిన నిరోధక చర్యల వల్ల 0.7 నుండి 0.4 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోందని తెలిపారు. హెచ్. ఐ. వీ వ్యాధిగ్రస్థులకు ఆసరా పెన్షన్ అందిస్తున్నదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎయిడ్స్, షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు.
