NTV Telugu Site icon

Varanasi: మోడీపై నామినేషన్ వేయనివ్వలేదన్న కమెడియన్ శ్యామ్ రంగీలా

Sayam

Sayam

ప్రధాని మోడీ వారణాసిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయనపై పోటీగా నామినేషన్ వేసేందుకు యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలా రెడీ అయ్యారు. అయితే ఆయనకు చుక్కెదురైంది. లోపలికి వెళ్లేందుకు ఆయనను అనుమతించలేదు.

వారణాసి నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్‌ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని శ్యామ్ రంగీలా ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. మే 10వ తేదీ శుక్రవారం నుంచి వారణాసిలో నామినేషన్ వేసేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయమని, మంగళవారం కూడా తనను జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి అనుమతించలేదని ఆయన తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

వారణాసిలో నామినేషన్ వేయడానికి మంగళవారంతో గడవు ముగిసింది. చివరి రోజు వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. హ్యాట్రిక్ విజయం కోసం ఇక్కడి నుంచి మరోసారి ఆయన బరిలోకి దిగారు. మోడీకి ముందు వారణాసి నియోజకవర్గం నుంచి 14 మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, బీఎస్‌పీ అభ్యర్థి అథర్ ఆలి ఇందులో ఉన్నారు.

వారణాసి నుంచి తనను నామినేషన్ వేయడానికి అనుమతించ లేదంటూ శ్యామ్ రంగీలా చేసిన పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. ప్రధాని మోడీతో సహా ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే హక్కు ఉందని, అయితే ఈ నియోజకవర్గం నుంచి ఇతర వ్యక్తులను పోటీ చేయడానికి అనుమతించడం లేదని ఆ పార్టీ ఆరోపించింది. శ్యామ్ రంగీలా అనే యూ ట్యూటర్ వారణాసి నుంచి నామినేషన్ వేయాలనుకుంటే జిల్లా యంత్రాగం నుంచి నామినేషన్ పత్రాలు పొందలేకపోయాడని, ప్రజలను చూసి మోడీ ఎందుకు భయపడుతున్నారని ఆ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారిని పోటీ చేయనీయండని వ్యాఖ్యానించారు.