Site icon NTV Telugu

Coconut Dosa: దూదిలాంటి మెత్తని ‘కొబ్బరి దోశ’.. లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్!

Kobari Dosa

Kobari Dosa

సాధారణంగా మనం తినే దోశలు చాలా రకాలుగా ఉంటాయి.. అందులోను కరకరలాడుతూ ఉంటాయి, కానీ నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉండేదే కొబ్బరి దోశ మాత్రమే. కర్ణాటకలో దీనిని ‘కాయీ దోశ’ అని పిలుస్తారు. పచ్చి కొబ్బరి లోని తీపి, అటుకుల మృదుత్వం కలగలిసిన ఈ వంటకం చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని వృద్ధుల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన అల్పాహారం. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో మినప్పప్పు వాడము కాబట్టి చాలా తేలికగా జీర్ణమవుతుంది, పైగా కొబ్బరి లోని మంచి కొవ్వులు శరీరానికి శక్తిని ఇస్తాయి.

కావలసిన పదార్థాలు:
1.బియ్యం (సోనా మసూరి లేదా రేషన్ బియ్యం) – 2 కప్పులు.

2.తాజా పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు.

3.అటుకులు – అర కప్పు.

4.మెంతులు – 1 టీస్పూన్.

తయారీ విధానం:
బియ్యం మరియు మెంతులను 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకులను గ్రైండ్ చేయడానికి 15 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది. తర్వాత నానబెట్టిన బియ్యం, మెంతులు, అటుకులు మరియు కొబ్బరి తురుము కలిపి మిక్సీలో వెన్నలా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియబెట్టాలి. పిండి ఎంత బాగా పులిస్తే దోశలు అంత మెత్తగా రంధ్రాలతో వస్తాయి. మరుసటి రోజు పిండిలో ఉప్పు కలిపి, వేడి పెనంపై మందంగా వేయాలి. దీనిని సాధారణ దోశలా పల్చగా రుద్దకూడదు.

ముఖ్యమైన చిట్కా: కొబ్బరి దోశను కేవలం ఒక వైపు మాత్రమే కాల్చాలి. మూత పెట్టి ఆవిరిపై ఉడికించడం వల్ల పైన చిన్న చిన్న రంధ్రాలు పడి దూదిలా తయారవుతుంది.

ఈ దోశలను అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా నాన్-వెజ్ ప్రియులైతే చికెన్/మటన్ కర్రీతో తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవి సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయి కాబట్టి పిల్లల లంచ్ బాక్స్ లకు ఇది సరైన ఎంపిక.

Exit mobile version