Cockroach Control Tips: ఇంటిని, ముఖ్యంగా వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. చాలామంది ఇళ్లలో వంటగది సింక్, వాష్ బేసిన్ లేదా కప్‌బోర్డులలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల మందులు, స్ప్రేలు వాడినా కొన్నిసార్లు ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది. మన వంటింట్లో లభించే సహజసిద్ధమైన వస్తువులతో బొద్దింకలను శాశ్వతంగా ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పడు తెలుసుకుందాం.
దోసకాయ ముక్కలు లేదా తొక్కలు
దోసకాయ వాసన బొద్దింకలకు అస్సలు పడదు. దోసకాయ తొక్కలను లేదా ముక్కలను ఎండబెట్టి, బొద్దింకలు ఎక్కువగా తిరిగే కప్‌బోర్డులు, మూలలు లేదా డ్రైనేజీ ప్రాంతాల వద్ద ఉంచాలి. ఆ ఘాటైన వాసనకి బొద్దింకలు ఆ ప్రదేశాల్లోకి రాకుండా దూరంగా పారిపోతాయి.
బేకింగ్ సోడా & చక్కెర మిశ్రమం
బొద్దింకలను వదిలించుకోవడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన చిట్కా. బేకింగ్ సోడాలో కొద్దిగా పంచదార కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లాలి. పంచదార తీపి వాసనకు ఆకర్షితులై బొద్దింకలు దీనిని తింటాయి. బేకింగ్ సోడా వల్ల వాటి కడుపులో గ్యాస్ ఏర్పడి అవి నశిస్తాయి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల బొద్దింకల సంతతి పూర్తిగా తగ్గుతుంది.
బిర్యానీ ఆకుల పొడి
బిర్యానీ ఆకులకు ఉండే సహజమైన ఘాటు బొద్దింకలకు ప్రతికూలమైనది. బిర్యానీ ఆకులను మెత్తగా పొడి చేసి, సింక్ కింద లేదా బొద్దింకలు ఎక్కువగా సంచరించే మూలల్లో చల్లాలి. ఈ వాసన ప్రభావానికి బొద్దింకలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతాయి.
సింక్, వాష్ బేసిన్ పైపుల శుభ్రత
చాలావరకు బొద్దింకలు సింక్ పైపులు, డ్రైనేజీ రంధ్రాల గుండా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. బకెట్ నీళ్లలో కొద్దిగా అమోనియం కలిపి రాత్రి పడుకునే ముందు కిచెన్ సింక్, వాష్ బేసిన్ డ్రెయిన్లలో పోయాలి. దీని ఘాటైన వాసనకి పైపుల్లో ఉన్న బొద్దింకలు పైకి రాకుండా అక్కడికక్కడే నశిస్తాయి.
బోరిక్ పౌడర్
బోరిక్ పౌడర్ బొద్దింకలను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది. బోరిక్ పౌడర్‌లో కొద్దిగా పంచదార పొడి కలిపి మూలల్లో చల్లడం ద్వారా బొద్దింకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే బోరిక్ పౌడర్, గోధుమపిండి, కొద్దిగా పంచదార కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి కప్‌బోర్డులు, అల్మారాల కింద ఉంచితే బొద్దింకలు వాటిని తిని నాశనమవుతాయి.
నిమ్మ తొక్కలు, ఉల్లిపాయ, లవంగాల మిశ్రమం
ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కలు వార్డ్‌రోబ్‌లలో ఉంచితే బొద్దింకల తాకిడి తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ పేస్ట్‌లో కొన్ని లవంగాలు లేదా లవంగాల పొడి కలిపి బొద్దింకలు చేరే ప్రాంతాలలో ఉంచడం వల్ల, ఆ ఘాటైన వాసనకు బొద్దింకలు గుడ్లు పెట్టకుండా, అక్కడ నివాసం ఏర్పరచుకోకుండా పారిపోతాయి.
ఈ సహజ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఖరీదైన కెమికల్స్ వాడకుండానే వంటింట్లో బొద్దింకల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

