NTV Telugu Site icon

CM YS Jagan: చిరకాల స్వప్నం.. చరిత్రను మార్చబోతున్నాం..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.. ఇక, తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను జెండా ఊపి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు చిరకాల స్వప్నం, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్‌ చేశామని తెలిపారు.. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేసిన ఆయన.. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆకాంక్షించారు ఏపీ ముఖ్యమంత్రి.

ఇక, 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంలో బందరు పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు సీఎం జగన్‌.. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకు కూడా ఇది చేరువలో ఉంటుందని.. ఇక, పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు సీఎం జగన్‌.. బందరుకు శతాబ్దాల చరిత్ర ఉంది.. అన్ని అనుమతులు వచ్చాయి.. రూ.5156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని.. ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందన్నారు సీఎం జగన్‌.

చంద్రబాబు మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశాడని మండిపడ్డారు సీఎం జగన్‌.. పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయి.. ఇక అడుగులు వేగంగా పడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మచిలీపట్నం రూపు రేఖలు మారుతున్నాయన్నారు.. గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.. వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేదన్న ఆయన.. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారని తెలిపారు.. బందరు విద్యార్థులు ఇక్కడే మెడికల్ విద్య పొందే అవకాశం కల్పించాం.. మెడికల్ కాలేజీ నిర్మించామని వెల్లడించారు సీఎం జగన్‌.. కాగా, తొలి దశలో నాలుగు బెర్తులు, 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి 3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం కలుగుతుంది. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. ఈ పోర్టు క్లింకర్, గ్రానైట్ బ్లాక్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది.

5156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుంది : CM Jagan l NTV