Site icon NTV Telugu

CM Yogi: యూపీ సీఎం కీలక ప్రకటన.. కన్యా సుమంగళ యోజన రూ.10 వేలు పెంపు!

Up Cm Yogi Adityanath

Up Cm Yogi Adityanath

CM Yogi Adityanath: రక్షాబంధన్ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లలకు భారీ కానుకను అందించారు. బుధవారం లోక్‌భవన్‌లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2024-25 ఏడాది నుంచి డబుల్ ఇంజన్ ప్రభుత్వం కన్యా సుమంగళ పథకాన్ని ఆర్థికంగా రూ.15,000 నుండి రూ.25,000కి పెంచబోతోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని ఆడబిడ్డలు తమ కలలను సాకారం చేసుకోవడంతోపాటు చదువుతో పాటు స్వావలంబన సాధించడం సులభతరం అవుతుందన్నారు.

Also Read: Indian Tech Worker: కెనడా బాట పట్టిన భారత టెక్కీలు.. 12 నెలల్లో 15 వేల మంది..

కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఈ పథకం కింద తొలుత ఆరు దశల్లో రూ.15 వేల ప్యాకేజీ ఇచ్చామన్నారు. ‘‘వచ్చే ఏడాది నుంచి కూతురు పుట్టిన వెంటనే ఆమె తల్లిదండ్రుల ఖాతాకు రూ. 5వేలు.. అదే విధంగా కూతురికి ఏడాది నిండితే మొదటి తరగతిలో చేరగానే రూ.2 వేలు బదిలీ చేస్తారు. ఆరో తరగతిలో చేరినప్పుడు రూ.3000, తొమ్మిదో తరగతిలో చేరినప్పుడు రూ. 3,000, ఇంటర్‌ అయిపోయిన తర్వాత రూ. 5,000, గ్రాడ్యుయేట్, డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సును అభ్యసిస్తే రూ. 7,000 మొత్తం ఆమె ఖాతాకు బదిలీ చేయబడుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ఈ పథకం ద్వారా నేడు రాష్ట్రంలో 16.24 లక్షల మంది ఆడపిల్లలు లబ్ధి పొందుతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని సీఎం యోగి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఆడబిడ్డల భద్రత, రక్షణ, ముందుకు సాగడానికి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుపేద సోదరీమణులందరికీ రేషన్‌కార్డు, ఆయుష్మాన్ భారత్ యోజన సహా అన్ని ప్రభుత్వ పథకాల కింద వర్తింపజేస్తామని సీఎం యోగి అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కన్యా సుమంగళ పథకం లబ్ధిదారులు ముఖ్యమంత్రి యోగికి రాఖీ కట్టి సంప్రదాయబద్ధంగా ఆయన నుదుటిపై బొట్టు పెట్టారు. ప్రతిగా ముఖ్యమంత్రి యోగి బహుమతులు అందించారు. వారికి నిరంతరం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 29,523 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.5.82 కోట్లను ముఖ్యమంత్రి బదిలీ చేశారు. పది మంది లబ్ధిదారులకు, వారి తల్లిదండ్రులకు చెక్కులను పంపిణీ చేశారు.

Also Read: Griha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక

ఈ పథకం వల్ల తన చదువు సులభతరమైందని లబ్ధిదారుల్లో ఒకరైన రత్న మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి వల్లే తన కలలు నెరవేరుతున్నాయన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, 10వ తరగతి విద్యార్థిని అక్షర కుష్వాహ మాట్లాడుతూ, ఈ పథకం తనలాంటి ఆర్థికంగా వెనుకబడిన బాలికల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చిందని అన్నారు. ఈ పథకం ద్వారా అంచెలంచెలుగా ఇతర పిల్లలతో కలిసి చదువుకుని ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

కస్తూర్బా కన్యా ఇంటర్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్న శివాంశి విశ్వకర్మ తనని తాను ముఖ్యమంత్రికి సంస్కృతంలో పరిచయం చేసుకుంది. ఆమె దేశభక్తి, సంస్కృతి భావాలను రేకెత్తిస్తూ ఒక సంస్కృత పాటను కూడా శ్రావ్యంగా పాడింది, తద్వారా హాజరైనవారిలో జాతీయతా భావాన్ని నింపింది. ముఖ్యమంత్రి యోగికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పథకం ద్వారా చదివి ఉపాధ్యాయురాలిగా మారాలన్న తన ఆకాంక్షను ఆమె పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ, శిశు అభివృద్ధి, పోషకాహార శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య, రాష్ట్ర మహిళా సంక్షేమ, శిశు అభివృద్ధి, పోషకాహార శాఖ మంత్రి ప్రతిభా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version