Site icon NTV Telugu

CM Revanth: రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్యట‌న‌

Medaram

Medaram

రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్యటించనున్నారు. మేడారం జాత‌ర‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాత‌ర‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం న‌డుంబిగించింది. ఇంతకాలం మేడారం జాత‌ర‌కు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహ‌ణ‌పై స‌మీక్షకు సైతం గ‌తంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వ‌హిస్తున్నారు. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం రోజు మేడారం క్షేత్ర స్థాయి సంద‌ర్శన‌కు సీఎం వెళుతున్నారు.

Also Read:Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం, రోడ్లు నదుల్లా మారి ప్రజలు ఇబ్బందులు

స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించటం ఇదే తొలిసారి. మేడారం పూజ‌రులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజ‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్రముఖుల‌తో జాత‌ర నిర్వహణ, కొత్త నిర్మాణాల‌పై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో స‌మీక్ష నిర్వహించ‌నున్నారు. ఆదివాసీ సంప్రదాయాల‌కు పెద్ద పీట వేస్తూ ఇల‌వేల్పులు స‌మ్మక్క, సార‌ల‌మ్మ, ప‌గిడిద్దరాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు ప్రభుత్వం శ్రీ‌కారం చుడుతోంది.

కోట్లాది భ‌క్తులు వ‌చ్చే జాత‌ర ప్రాశ‌స్త్యానికి త‌గ్గట్లు భారీ ఎత్తున స్వాగ‌త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ద్దెల వ‌ద్దకు భ‌క్తులు సులువుగా చేరుకోవడం.. గ‌ద్దెల ద‌ర్శనం… బంగారం (బెల్లం) స‌మ‌ర్పణ‌.. జంప‌న్న వాగులో స్నానాలచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌నున్నారు. మేడారం అభివృద్ధి ప‌నుల్లో గిరిజ‌న సంప్రదాయాలు, విశ్వాసాల‌కు ఎటువంటి భంగం క‌ల‌గ‌వ‌ద్దనే కృత‌నిశ్చయంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్మాణం.. ప్రతి క‌ట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాల‌కు అనుగుణంగా, మేడారం జాత‌ర పూజారులు, ఆదివాసీ పెద్దల‌ సూచ‌నలతో ప్రభుత్వం చేప‌ట్టనుంది.

నిర్మాణాల్లో విలువైన గ్రానైట్‌, లైమ్‌స్టోన్ రాళ్లను వాడ‌నున్నారు. పురాత‌న ఆల‌యాల పునఃనిర్మాణం, ప్రసిద్ధ ఆల‌యాల్లో అభివృద్ధి ప‌నుల్లో ప్రసిద్ధుడైన స్తప‌తి ఈమ‌ని శివ‌నాగిరెడ్డి సేవ‌ల‌ను మేడారం అభివృద్ది ప‌నులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది. గ‌తంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాత‌ర‌కు వెళ్లడం… ద‌ర్శనాల‌తో స‌రిపుచ్చేవారు. మేడారం అభివృద్దిపై ఏమాత్రం శ్రద్ద వ‌హించలేదు. ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ ప‌టంలో జాత‌ర‌కు మ‌రింత వ‌న్నె తేవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక‌ల్పించారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా మేడారం జాత‌రను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే సీఎం అధికారులను ఆదేశించారు.

Also Read:IBPS RRB Recruitment 2025: ఇంకా అప్లై చేయలేదా.. 13,217 బ్యాంక్ జాబ్స్.. దరఖాస్తు గడువు పొడిగింపు

రెండేళ్లకోసారి జరిగే మహా జాత‌రతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరిగింది. వీకెండ్, సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవ‌స‌ర‌మైన వ‌స‌తి, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. మేడారం అభివృద్ధి ప‌నులతో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల‌కు పెద్ద పీట వేయటంతో పాటు ఆధ్యాత్మిక ప‌ర్యాట‌కానికి ప్రభుత్వం ఊత‌మివ్వనుంది. ఫ‌లితంగా మేడారం సమీపంలో ఉన్న రామ‌ప్ప, ఇత‌ర ఆల‌యాల‌కు భ‌క్తుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌నున్నాయి.

Exit mobile version