తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా కుల గణన లెక్కల్లో తేడాలు ఉంటే వివరాలు ఇవ్వాలని, వాటిని రాబోయే కేబినెట్ భేటీలో చర్చించి సరిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బ్రిటిష్ కాలం తర్వాత దేశంలోనే తొలిసారిగా వందేళ్ల నాటి రికార్డులను పక్కనపెట్టి తమ ప్రభుత్వమే సాహసోపేతంగా సమగ్ర కుల గణనను పూర్తి చేసిందని సీఎం తెలిపారు. ఏ కులం వారైనా సరే తమ లెక్క తప్పుగా ఉందని భావిస్తే, గణాంకాల్లోకి రాని వారి వివరాలు తీసుకువచ్చి ఇవ్వాలని కోరారు. ఆ వివరాలను పరిశీలించి కలుపుతామని, దీనిపై రాబోయే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజులను బీసీ-ఏ జాబితాలో చేర్చే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతామని, గంగపుత్రుల అపోహలను కూడా తొలగిస్తామని చెప్పారు.
బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, విడతలవారీగా సముచిత పదవులు అందిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు వ్యవహారంపై పీసీసీని ఒప్పించే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక సంక్షేమ పథకాలపై స్పందిస్తూ.. గత పాలన కంటే మెరుగ్గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో దొడ్డి కొమరయ్యతో పాటు పండుగ సాయన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదమే తనకు బలమని, దేశంలో బలహీన వర్గాలు మరింత అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

