తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Also Read:Donald Trump: “పిల్లలురా మీరు”.. ఇజ్రాయిల్-ఇరాన్‌పై ట్రంప్ వ్యాఖ్యలు..
మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని… సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలియజేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై సీఎం అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని.. తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు.
