Site icon NTV Telugu

Road Accident: జబల్‌పుర్‌ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం!

Jabalpur Road Accident

Jabalpur Road Accident

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నగరంలోని నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు త్వరిగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు.

జబల్‌పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో ఆయన మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని.. గాయపడిన వారికి సరైన చికిత్సనందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి.. ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులనూ ఫోన్‌లో కేంద్రమంత్రి పరామర్శించారు. ప్రమాద ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తున్న తెలుగు యాత్రికులు మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును జబల్‌పూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని మోహ్లా, బర్గి గ్రామాల మధ్య ఉన్న కాలువ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. జబల్‌పూర్ నుండి కాట్నీ వైపు వెళ్తున్న ట్రక్.. రాంగ్ రూట్‌లో వెళ్లి మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 14 మంది ఉన్నారు. ప్రమాదానికి గురైన వాహనం నంబర్ AP29 W 1525గా స్థానిక పోలీసులు గుర్తించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించారు.

Exit mobile version