కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమ అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) 2.0 పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, దీనివల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకమైన వీబీ-జీ రామ్-జీ జాబితాలో మరికొన్ని అదనపు పనులను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతుల జీవనోపాధిని దెబ్బతినకుండా కాపాడేందుకు 10 కొత్త రకాల పనులను ఉపాధి హామీ కింద నిర్వహించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కూరగాయల పందిళ్ల నిర్మాణం, పశుగ్రాస ప్లాట్ల పెంపకం, మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల షెడ్ల ఏర్పాటు వంటి వ్యవసాయ అనుబంధ పనులకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించారు.
దీంతో పాటు రైతుల సొంత భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ చర్యలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న సాగుభూముల పునరుద్ధరణ పనులకు ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా ఈ పథకం జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగమయ్యే లబ్ధిదారులకు కనీసం 90 రోజుల పాటు పని కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సమగ్రంగా వివరించారు.

