Site icon NTV Telugu

Revanth Reddy: కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం!

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ‘మే’ డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందన్నారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు -2025 త్వరలో తీసుకవస్తామన్నారు.

Read Also: Rahul Gandhi: ‘‘మా విజన్ స్వీకరించినందుకు సంతోషం’’.. కుల గణనపై రాహుల్ గాంధీ..

ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతుందని చెప్పారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు.

Read Also: Simhachalam Incident: సింహాచలం ఘటనపై ఎంక్వైరీ కమిషన్‌.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు..

రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించడం జరిగిందన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున బోనస్‌ ఇవ్వడంతో పాటు, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ కార్మికులు ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా.. వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. చేనేత కార్మిక కుటుంబాలను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు రుణమాఫీ అమలు చేశామన్నారు.

Exit mobile version