CM Revanth Japan Tour: ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు గల అత్యంత ముఖ్యమైన మార్గంగా విదేశీ పర్యటనలను చేస్తుండడం మరింత జోరుగా మారింది. రాష్ట్రాలకి విదేశీ పెట్టుబడులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటిస్తూ అక్కడి పరిశ్రమలతో, పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జపాన్ పర్యటన చేపట్టింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం టోక్యోకు చేరుకుంది. టోక్యో విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ బృందంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
బుధవారం రాత్రి టోక్యోలోని వందేళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో భారత రాయబారి షిబు జార్జ్ ఈ బృందానికి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రఘువీరా రెడ్డితోపాటు తమిళనాడు డీఎంకే ఎంపీలు కనిమొళి, నెపోలియన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమిళనాడు ఎంపీలతో పలు అభివృద్ధి అంశాలపై చర్చింతలు సమాచారం. అలాగే రాయబారి షిబు జార్జ్‌తో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల పట్ల ఉన్న అనుకూలతను, సులభతర వ్యాపార విధానాలను వివరించారు.
జపాన్ లోని ఒసాకా నగరంలో ఈ నెల 13 నుంచి అక్టోబర్ 13 వరకు జరిగే ఎక్స్‌పో 2025లో ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం మొదటి సారిగా ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ వేదికలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విదేశీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించనున్నారు. ఇక నేడు ( గురువారం) జైకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్‌ఎఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ దశలో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.24,269 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు. ఇందులో రాష్ట్రం 30 శాతం, కేంద్రం 18 శాతం భరించగా, మిగతా 48 శాతం నిధులను జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ లాంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా 4 శాతం నిధులను పీపీపీ మోడల్‌లో సమకూర్చనున్నారు. జైకా కేవలం 2 శాతం వడ్డీతో రుణాలు మంజూరు చేస్తుండడంతో, మెట్రో రెండో దశ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు మరింతగా సాయం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఈ సమావేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తంగా ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, విదేశీ భాగస్వామ్యం, ప్రాజెక్టుల అమలు కోసం అవసరమైన ఆర్థిక సహకారం అందనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఒక కొత్త దిశగా ప్రస్థానం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
