CM Revanth: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల (SRPCC) సమన్వయ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందరబంగా ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలు నేడు అత్యంత కీలకమైన సవాళ్లుగా మారాయి. పోలీస్ శాఖలోని ప్రతి విభాగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరైన శిక్షణపై దృష్టి సారిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, ఫలితంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచి ప్రత్యేక గుర్తింపును దక్కించుకుందని ఆయన ప్రశంసించారు.
సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల అణచివేత, నక్సల్స్ హింసను పూర్తిగా అరికట్టడంలో తెలంగాణ పోలీస్ శాఖ విశేషమైన విజయాలు సాధించింది. ప్రధానమంత్రి నిర్వహించిన ప్రగతి (PRAGATI) సమీక్షలో సైబర్ క్రైమ్ నివారణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో తెలంగాణ చేపట్టిన ‘ఈగల్’ విభాగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు లభించడం రాష్ట్ర పోలీసుల పనితీరుకు నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు.
సైబర్ బాధితులకు పోయిన డబ్బును తిరిగి రికవరీ చేయడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని.., ఆహార కల్తీ, డ్రగ్స్ కంట్రోల్ లక్ష్యంగా అమెరికాలోని ఎఫ్‌డీఏ (FDA) తరహాలో ‘టీజీ సేఫ్’ (TG Safe) అనే ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మరోవైపు చెరువులు, జలవనరుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRAA) ప్రజల మన్ననలు పొందుతోందని.. సమాజంలో మార్పునకు నాంది పలుకుతూ హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని సీఎం గుర్తుచేశారు.
సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని సీఎం ఉద్ఘాటించారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు అందరి పిల్లలకూ ఇక్కడ సమాన విద్యావకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ర్యాంకు, సర్వీసును బట్టి రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా, ఇంటి స్థలాలు, కారుణ్య నియామకాల కింద అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రకటించారు.
ఏ ఒక్క రాష్ట్రం కూడా ఒంటరిగా నేరాలను పూర్తిగా అరికట్టలేదని, పొరుగు రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య పరస్పర సమన్వయం అత్యవసరమని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ నేరరహితంగా, అత్యంత సురక్షితంగా తీర్చిదిద్దే బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల పోలీస్ ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దు సమన్వయానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తన అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను, ఐటీ ఫ్రేమ్‌వర్క్‌ను పొరుగు రాష్ట్రాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, సురక్షిత దక్షిణాది నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

