NTV Telugu Site icon

D.Srinivas: ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నేతలు సంతాపం..

Ds

Ds

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్ధివ దేహాన్ని ఈరోజు ఉదయం 9 గంటలకు ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి, మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు డీఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ కు తరలిస్తారు. రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు డీఎస్ కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Delhi Rains : ఢిల్లీలో కుండపోత వర్షంపై ఐఎండీ అంచనా విఫలం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్.. రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు- డిప్యూటీ సీఎం
ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. పార్టీలో వివిధ స్థాయిల్లో, సుదీర్ఘ కాలం పాటు ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. డి శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.

విశేష సేవలందించారు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మృతి పట్ల రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రసంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షులుగా, రాష్ట్ర మంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా విశేష సేవలందించిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను అధిష్టానానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. డి. శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని తెలిపిన మంత్రి.. డి. శ్రీనివాస్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకుర్చాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం తెలిపిన మంత్రి జూపల్లి
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. డి. శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. డి. శ్రీనివాస్ తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.

రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు- కిషన్ రెడ్డి..
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదని.. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

DS మృతి బాధాకరం- ఎంపీ డీకే అరుణ
తెలంగాణ సీనియర్ పొలిటిషియన్, మాజీ మంత్రి DS మృతి పట్ల మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. డీఎస్ తనయుడు, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. మంత్రిగా, పీసీసీ చీఫ్ గా, ఎంపీగా డీఎస్ చేసిన సేవలు మరువలేనివని డీకే అరుణ తెలిపారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
మాజీ మంత్రి, ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిగా, పిసిసి చీఫ్ గా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు. డీఎస్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు- రేణుకా చౌదరి
ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. పార్టీలో వివిధ స్థాయిల్లో, సుదీర్ఘ కాలం పాటు ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి చేసుకున్నారు. డి శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.