NTV Telugu Site icon

CM KCR : తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓరుస్తలేదు

Kcr Meeting

Kcr Meeting

బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పలు కార్పోరేషన్ల ఛైర్మన్ లు, మేయర్ లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3.20 కి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తొలుత ఇటీవల మరణించిన పార్టీ ఎమ్మెల్యే బండి సాయన్న చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభిస్తూ బండి సాయన్న మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి దు:ఖాన్ని తట్టుకునే శక్తిని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. సమావేశం సాయన్న మరణానికి సంతాపం ప్రకటిస్తూ కాసేపు మౌనం పాటించింది.

ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

తెలంగాణ రాష్ట్ర ప్రగతి:

• తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే ముందు వరుసలో దూసుకుపోతుంది. స్వయంపాలనను విఫలయత్నంగా చేయాలని ప్రారంభదశలో సృష్టించిన అనేక అడ్డంకులను దాటుకొని మనం నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతిని చూసిన ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో ప్రజలు మనకు అండగా నిలబడ్డారు.
• విద్యుత్ కోతలు లేకుండా చేసుకున్నాం.
• సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం.
• ఇవాళ ప్రతీ ఇంటికి తాగునీరు నల్లాల ద్వారా అందుతున్నది.
• సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తెలంగాణ చేరుకున్నది.
• వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.
• పసిపిల్లలు, ముసలివాళ్ళ నుంచి ఆడబిడ్డలు వరకు, రైతన్నల నుంచి ఐటి, పరిశ్రమల వరకు ప్రతీ రంగంలో సంక్షేమం, అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం నేడు సమ్మిళితాభివృద్ధిని సాధించింది

• ఇవాళ విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నది. మన పారిశ్రామిక విధానాలను ప్రపంచం మెచ్చుకుంటన్నది.
• ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.
• ఒకప్పుడు ఐటి రంగంలో సిలికాన్ వ్యాలీగా చెప్పుకున్న బెంగుళూరును మించి హైదరాబాద్ ఐటి రంగంలో పురోగతిని సాధిస్తున్నది
• మొన్న వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఫాక్స్ కాన్ ఛైర్మన్ తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడం మనందరికీ గర్వకారణం.
• ఇంతటి అభివృద్ధి సాధించిన మన పార్టీ ఘనవిజయాలను గుర్తు చేసుకుంటూనే, మరింతగా ప్రజల్లోకి మన పార్టీని, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.

• తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బిజెపి పార్టీ ఓర్వలేకపోతున్నది.
• దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ చేతకాని తనం బయటపడుతుందనే అక్కసుతో అనేక కుట్రలకు బిజెపి పాల్పడుతున్నది. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధిస్తున్నది.
• ఇప్పటికే మన పార్టీ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని సిబిఐ, ఐటి, ఈడి దాడులతో తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నది. బిజెపి వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతాం. ఎదుర్కొంటాం.
• ఈ దేశం నుండి బిజెపి పార్టీని పారద్రోలేవరకు మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.

ప్రజాప్రతినిధులకు ఆదేశాలు:

• బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి.
• ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి
• ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ ఛైర్మన్ లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలి. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలి.
• ప్రజాప్రతినిధులు వీలయినంత వరకు ప్రజల్లోనే ఉండాలి.

• కంటి వెలుగు శిబిరాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తున్నది. వీటిని స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఒక బాధ్యతగా సందర్శించాల్సిన అవసరం ఉన్నది.

• త్వరలో నిర్వహించబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం కూడా ప్రజాప్రతినిధులు సిద్ధమై ఉండాలి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

• ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నది.
• ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి దళితబిడ్డలు పాల్గొంటారు.
• సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి అర్పిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మీయ సభల నిర్వహణ:

• బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుంది.
• ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తాం. ఈ సభలో పార్టీకి సంబంధించిన అన్ని కేటగిరీలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
• ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను అక్టోబర్ లో వరంగల్ లో నిర్వహిస్తాం.

సచివాలయం ప్రారంభోత్సవం:

• ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభోత్సవం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సహా, ఆహ్వానితులు పాల్గొంటారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఏప్రిల్ 30 న ప్రారంభిత్సున్న నేపథ్యంలో పార్టీల అన్ని కేటగిరీల నాయకులు హాజరు కావాల్సి ఉంటుంది.

అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవం:

• జూన్ 1న అమరుల స్మారకార్థం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకులైన అమరవీరులను స్మరించుకునేందుకు, వారి ఘనమైన నివాళులు అర్పించుకునేందుకు నిర్మించిన తెలంగాణ అమర జ్యోతిని ప్రారంభించుకుందాం.
• ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొనాలి.

• జూన్ 2 న వారి వారి నియోజకవర్గాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలి.

బీఆర్‌ఎస్‌వీ బలోపేతం:

• బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి
• రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు విద్యార్థిసంఘ బలోపేతానికి చర్యలు చేపట్టాలి.
• ఇంకా మిగిలిన ఉన్న పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలి.

• ఎన్నికల కోడ్ అనంతరం ఇంకా మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీని పూర్తి చేయాలి.
• 58,59 జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలు పేద ప్రజల కోసం సద్వినియోగపరుచుకోవాలి.

దళితబంధు రెండవ విడత పంపిణీ – వేడుకల నిర్వహణ:

• ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్దిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలే ప్రతిపాదనలు చేసి సంబంధిత కలెక్టర్లకు పంపించాలి.
• ఎమ్మెల్యేల ప్రతిపాదనలను అనుసరించి కలెక్టర్లు లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికి నిబంధనల ప్రకారం దళితబంధు ప్రయోజనాన్ని కల్పిస్తారు.
• దళితబంధు నిధుల విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్దిదారులకు నిధులు అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే.
• దళితబంధు పథకం అమలులోకి వచ్చిన ఆగష్టు 16 వ తేదినీ పురస్కరించుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళితబంధు వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది.

గృహలక్ష్మి పథకం :

• సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాలి.
• ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి, వారికి గృహలక్ష్మి పథకం కింద భార్య పేరు మీదుగా రిజస్ట్రేషన్ చేసి బ్యాంకు ఖాతాల్లో మూడు దశల్లో, ప్రతీ దశలోనూ లక్ష రూపాయల చొప్పన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
• నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది.
• లబ్దిదారునికి చెందిన అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినా, పట్టా భూమి అయినా, అన్ని రకాల స్థలాల్లో కట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది.
• గృహలక్ష్మి పథకాన్ని భార్య పేరు మీద అమలుచేస్తున్నందున, భర్త పేరు మీద భూమి ఉన్నట్లయితే భార్య పేరు మీదకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది.

• పునాది సమయంలో లక్ష రూపాయలు, స్లాబు వేసిన అనంతరం లక్ష రూపాయలు, చివరగా నిర్మాణం పూర్తయి సున్నాలు వేసిన దశలో లక్ష రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు, నియమనిబంధనలను అనుసరించి అవినీతికి ఎటువంటి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే.
• పేదలకు అందే పథకాల్లో అవినీతి జరిగితే క్షమించే ప్రసక్తే లేదు. ఇది ఎమ్మెల్యేల భవిష్యత్తు పై ప్రభావం చూపుతుంది. కాబట్టీ జాగ్రత్తగా వ్యవహరించాలి.

గొర్రెల పంపిణీ

• ప్రభుత్వం రెండవ దశ గొర్రెల పంపిణీనిన ప్రారంభిస్తున్న నేపథ్యంలో అవినీతి లేకుండా లబ్దిదారులకు ప్రయోజనం అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తూచ తప్పకుండా అమలుచేస్తూ మే, జూన్ కల్లా పూర్తి చేయాలి. 3.5 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుంది.

పోడు భూముల పంపిణీ

• ప్రభుత్వం పోడు భూముల పంపిణీ త్వరలో ప్రారంభిస్తుంది. అర్హులకు అందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జాగ్రత్తగా జరిపించాల్సిన అవసరం ఉన్నది.

Show comments