Site icon NTV Telugu

Employee Health Care Trust : దసరా కానుక..! ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌

Cm Kcr

Cm Kcr

Employee Health Care Trust : దసరాకు ముందే ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. న‌గ‌దు ర‌హిత, మ‌రింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఎంప్లాయి హెల్త్‌ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొద‌టి పీఆర్సీ క‌మిష‌న్ ప్రభుత్వానికి సూచించింది. ప‌థ‌కం అమ‌లుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా జ‌మ చేయాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు త‌మ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గ‌తంలో తెలిపారు.

దీంతో మంత్రి హరీష్‌ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ప్రకారం.. ఈహెచ్‌ఎస్‌ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. ఈహెచ్‌సీటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ , ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఈహెచ్‌ఎస్‌ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది.

ఉద్యోగులు, పెన్షనర్లు తమ కాంట్రూబ్యుషన్ గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జ‌మ చేస్తారు. ఈ మొత్తం ప్రతినెల వారి వేతనం నుంచి ఆటోమెటిక్‌గా ట్రస్ట్‌కు బదిలీ అవుతుంది. ప్రభుత్వం అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి నెల జ‌మ చేస్తుంది. ఈహెచ్ఎస్ నిర్వహ‌ణ‌కు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు 15 పోస్టుల‌ను మంజూరు చేసింది. ప‌థ‌కం అమ‌లుకు సంబంధించిన విధివిధానాల‌ను ప్రత్యేకంగా విడుద‌ల చేస్తారు. ఉద్యోగులు, పెన్షన‌ర్లకు నూత‌న ఎప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమ‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించ‌డంపై ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ల మంత్రి హ‌రీష్‌ రావు హ‌ర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షన‌ర్లు, వారి కుటుంబ స‌భ్యుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అంద‌నున్నాయ‌న్నారు.

Exit mobile version