ఏపీలో విపక్షాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లా కమలాపురం పర్యటనలో ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కమలాపురంలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా. వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి వైఎస్సారే కారణం అన్నారు జగన్. గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు. మహానేత వైఎస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు జగన్.
Read Also: Posani Krishna Murali: చెంచాగిరి, డ్రామాలు చేయని ఒకేఒక్క నటుడు కైకాల
జిల్లాలో పలు పథకాల గురించి జగన్ వివరించారు. రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టాం. మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశాం. ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం దశదిశ మారిపోతుంది. కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. వివక్ష చూపించకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఎక్కడా మధ్యదళారులు లేరు. ఏ పథకం అయినా మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. ఇదంతా మీ బిడ్డ సీఎంగా ఉండడం వల్లే అన్నారు జగన్.
రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారు. విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదు. అప్పటి పాలకులు ఆ విషయం మరిచిపోయారు. కేంద్రం వివక్ష చూపిస్తోంది. జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి. కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం. న్యూ ఇయర్ కానుకగా మీకు స్టీల్ ఫ్యాక్టరీని అందించబోతున్నాం. గత ప్రభుతంలో లంచాలు ఇస్తేనే పెన్షన్లు వచ్చేవన్నారు. గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే. గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా లంచాలే. గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడు అదే బడ్జెట్. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయిందో ఆలోచించాలన్నారు.
Read Also:Cm Jagan Mohan Reddy: అమీన్ పీర్ దర్గా సందర్శించడం నా అదృష్టం
గత ప్రభుత్వ విధానం దోచుకో, పంచుకో, తినుకో.. గజ దొంగల మాదిరి దోచుకోవడం, పంచుకోవడమే వారి పని. కానీ ఇప్పుడు డీబీటీ.. ద్వారా పథకాలన్నీ లబ్దిదారుల అకౌంట్లలోకి వచ్చి చేరుతున్నాయి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి అన్నారు జగన్. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి. ఎప్పుడూ నేను ఇదే విషయం చెబుతుంటాను. ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు సీఎంగా అదేమాటకు కట్టుబడి వున్నానన్నారు. ఇదే నా రాష్ట్రం.. ఇదే నా కుటుంబం. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు. ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదు.. ఈ భార్య కాకుంటే మరో భార్య అని దత్తపుత్రడిలా నేను అనడం లేదన్నారు.