బాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన తాడిపత్రి నుంచి మలిదశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత తొలి సారిగా ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశానన్నారు. బటన్ నొక్కి రూ.2లక్షల 70 వేల కోట్లు.. ప్రజల ఖాతాల్లో వేశామన్నారు. లంచాలు లేకుండా, వివక్ష లేని పాలనను అందించాం. ఈ 58 నెలల్లోనే 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. ఇంటి వద్దకే రేషన్ వస్తోంది. పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. టాప్ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. ప్రభుత్వ స్కూల్స్‌లో హక్కుగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?.’ అని సీఎం జగన్ అన్నారు.