CM YS Jagan: చరిత్రలోనే ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు.. ఇక నుంచి సామాజిక అమరావతి.. మన అందరిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.. ఆ తర్వాత పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, మోడల్ హౌస్‌ను పరిశీలించారు.. ఇక, వెంకటపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు.. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా? అని ప్రశ్నించారు. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా మారుస్తున్నాం.. ఈ రోజు దానికి పునాది రాయి వేస్తున్నా.. ఇక నుంచి అమరావతి మన అందరిది అంటూ వ్యాఖ్యానించారు.
నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశామని తెలిపారు సీఎం జగన్.. గత ప్రభుత్వం చేయని మంచిని నాలుగేళ్లుగా చేసిచూపించామన్న ఆయన.. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరారు.. అక్క చెల్లెమ్మల సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాం..అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం..అక్క చెల్లెమ్మలకు ఇస్తున్న ఇంటి విలువ రూ.7.5 లక్షల వరకు ఉంటుందన్నారు.. పేదలకు అండగా మార్పు మొదలైంది.. సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయింది? అని నిలదీశారు సీఎం జగన్.. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యం అంటూ మండిపడ్డారు. నా అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. కోర్టు కేసులతో దీనినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారని విరుచుకుపడ్డారు. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇది.. చరిత్ర ఉన్నంతవరకు ఇవాళ మరిచిపోలేని రోజుగా అభివర్ణించారు.
ఇంతకుముందే ఇంటి పట్టాలు అందించి.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదు వేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్.. చరిత్ర ఉన్నంతవరకూ ఇవాళ మరిచిపోలేని రోజుగా పేర్కొన్న ఆయన.. మన పేదల ప్రభుత్వానికి పెత్తందారుల కూటమికి యుద్ధం జరుగుతోంది.. పేదవాడికి ఏ మంచి పని జరిగినా అడ్డుకోవడమే వీరి పని అని మండిపడ్డారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకూడదా? పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? అంటూ నిలదీశారు. పేదల శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇది.. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలందరికీ ఈరోజు మరిచిపోలేని రోజుగా పేర్కొన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నాం.. ఇళ్లు కట్టిస్తానంటూ గతంలో చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు యత్నించారు.. పేదలకు ఇల్లు రాకూడదనేదే వీరందరి కుట్ర అని.. దీని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశాం.. మరెక్కడా ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్.
