ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గం ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆలయం వద్ద వేద పండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం దంపతులు సారె సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని చంద్రబాబు ప్రార్థించారు.
తిరుపతి గంగమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబు దంపతులు స్వీకరించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు బెంగళూరు బయలుదేరారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది.
