Site icon NTV Telugu

CM Chandrababu Naidu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చలు..!

Cm Chandrababu Naidu

Cm Chandrababu Naidu

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు సమావేశమై రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ కారణంగా పంటలకు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ సహాయం, దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యల కోసం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.

Jubilee Hills By Election Polling: షేక్ పేట్ లో లాఠీ ఝళిపించిన పోలీసులు

అలాగే మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించారు. ముఖ్యంగా పీఎం-ఆర్కేవివై-పీడీఎంసీ (PM-RKVY-PDMC) పథకం కింద రాష్ట్రానికి అదనపు నిధులను కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ. 695 కోట్ల నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ఈ నిధులు మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, రైతులకు మరింత మెరుగైన సాగునీటి సౌకర్యాలను అందించడానికి దోహదపడతాయని ఆయన వివరించారు.

Faridabad University Raid: “టెర్రర్ క్లినిక్”.. హర్యానా ఆస్పత్రిలో జైషే లింకులు !

అంతేకాకుండా, రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (Market Intervention Scheme – MIS) కింద తోతాపూరి మామిడి రైతులకు గతంలో ఇచ్చిన మద్దతు ధర (MSP) లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాను త్వరగా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. దీని ద్వారా రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశం రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, ఇరిగేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారాన్ని పెంచే దిశగా సానుకూల వాతావరణాన్ని కల్పించింది.

Exit mobile version