Chris Gayle: 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌పై ప్రపంచ క్రికెట్ దిగ్గజం, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ చూసి ఆశ్చర్యపోయాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం, ఒకే ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు బాదడం తనను విస్మయానికి గురిచేశాయని చెప్పాడు. అంతేకాదు.. వన్డే క్రికెట్‌లో త్వరలోనే 300 పరుగుల వ్యక్తిగత స్కోరు కూడా నమోదయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు.
క్రిస్ గేల్ మాట్లాడుతూ.. వైభవ్ ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడాడు. అతడి బ్యాటింగ్ గురించి తెలిసినప్పుడు తన ఫోన్ వరుసగా మోగిందని, అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదని చెప్పాడు. 12 ఓవర్లలోనే డబుల్ సెంచరీ చేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నాడు. తొలుత అది టీ20 మ్యాచ్ అయి ఉంటుందని భావించానని, కానీ 50 ఓవర్ల మ్యాచ్ అని తెలిసి మరింత షాక్‌కు గురయ్యానని వెల్లడించాడు. ఈ విధమైన బ్యాటింగ్ చూస్తుంటే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధించడం కూడా అసాధ్యమేమీ కాదని అభిప్రాయపడ్డాడు.
వైభవ్ సూర్యవంశీ ఆట క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోందని గేల్ ప్రశంసించాడు. అతడికి మరిన్ని అవకాశాలు రావాలని ఆకాంక్షించాడు. నిజానికి విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గేల్.. ఇప్పుడు వైభవ్ బ్యాటింగ్ ఎటాక్ కు ఫిదా అయిపోయాడు. అయితే వైభవ్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో తన పూర్తి స్థాయి ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు లభించిన అవకాశాల్లో నిలకడైన ప్రదర్శన చేయలేకపోయాడు. అయినప్పటికీ 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటుండటం అతడి ఆటతీరును నిదర్శనం. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే దూకుడు కొనసాగిస్తే భారత క్రికెట్‌కు మరో సూపర్‌స్టార్ దొరికినట్లే..

