Ganesh Procession Tragedy: వినాయక చవితి రోజు పెట్టిన విగ్రహాలకు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు భక్తులు.. ఇక, కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి నిమజ్జనాలు కూడా ప్రారంభం అయ్యాయి.. అయితే, వినాయకుడి నిమజ్జన ఊరేగింపులో విషాద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం దామరపాకంలో నిమజ్జన కార్యక్రమం కోసం.. ట్రాక్టర్‌కు జనరేటర్ ఏర్పాటు చేశారు.. ఆ జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చుట్టుకోవడంతో 11 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
వినాయకుడి ఊరేగింపు కోసం ట్రాక్టర్‌లో జనరేటర్ పక్కన చిన్నారి కూర్చున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె జుట్టు జనరేటర్ ఫ్యాన్‌కు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు చిన్నారిని చికిత్స కోసం తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందినట్లు సమాచారం. మృతురాలు దామరపాకానికి చెందిన శంకర్ కుమార్తె ప్రసన్న శ్రీ (11)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

