నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ కు వాస్తు మార్పులు చేపట్టారు అధికారులు. స్టేషన్ కు వాస్తు దోషం ఉండడం వల్లే కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఎస్సైలు వివాదాలతో బదిలీనో లేక సస్పెన్షన్ కో గురవుతున్నారని భావించిన అధికారులు.. వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తు మార్పుల్లో భాగంగా స్టేషన్ ముందు భాగం లో ఉన్న స్టోర్ రూమ్ ను గత నెల 29న కూల్చివేశారు పోలీస్ అధికారులు… హైదరాబాద్ నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెంట, హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ కావడంతో ఇక్కడ అన్ని పైరవీ పోస్టింగులే.. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న మండలం కావడంతో పోలీసు స్టేషన్ కు భూవివాదంతో కూడిన పంచాయతీలు కూడా ఎక్కువే….
దీంతో భూవివాదాల్లో తలదూర్చటం.. వివాదాలకు కేంద్రంగా మారడం బదిలీనో, సస్పెన్షనో చింతపల్లి పోలీస్ స్టేషన్ లో నిత్యకృత్యంగా మారింది… కొద్ది రొజుల క్రితం భూ వివాదంలో ఎస్సై సతీష్ రెడ్డి ఓ వ్యక్తిని చితకబాదడం అతను మృతి చెందడంతో ఎస్ఐ సతీష్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరు కాదు ఇద్దరు కాదు పదిమందికి పైగా ఎస్సైలు వేర్వేరు కారణాలతో బదిలీ అయ్యారు మరికొందరు తీవ్ర ఆరోపణలతో సస్పెండ్ కూడా అయ్యారు. దీనంతటికీ కారణం వాస్తు దోషమేనని తేల్చేసారు.. వాస్తు మార్పు కూడా చేసేసారు.. కానీ వచ్చే ఎస్సై ల బుద్ధి వంకర బుద్ధని… ఎన్ని వాస్తు మార్పులు చేసిన ఏం లాభం అని స్థానికులు చర్చించుకుంటున్నారు.