Toilet Usage Management Rule: ఆఫీస్ లలో పనిచేసేవారు ఎన్నో కొత్త కొత్త రూల్స్ వినడం వాటిని ఆచరించడం పరిపాటే. అయితే, తాజాగా చైనా దక్షిణ ప్రాంతంలోని ఒక కంపెనీ ఉద్యోగుల మరుగుదొడ్ల వినియోగంపై కఠిన నియమాలను అమలు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషాన్ లో ఉన్న ‘త్రీ బ్రదర్స్ మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ’ ఫిబ్రవరి 11 నుంచి కొత్త టాయిలెట్ యూజేజ్ మేనేజ్మెంట్ రూల్ అమలు చేసింది. ఇందులో ఉద్యోగులు కేవలం నిర్ణీత సమయాల్లోనే మరుగుదొడ్డిని ఉపయోగించుకోవాలి. అంతేకాదండోయ్.. ఒక్కోసారి కేవలం రెండు నిమిషాలపాటే ఉండాలని నియమం పెట్టారు.
కంపెనీ ప్రకారం ఈ పాలసీ ప్రధానంగా క్రమశిక్షణ, పనితీరు మెరుగుపరచడం, ఉద్యోగుల్లో సానుకూల భావోద్వేగాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే, ఇది ఉద్యోగుల హక్కులకు విఘాతం కలిగిస్తుందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ విధించిన కొత్త షెడ్యూల్ ప్రకారం, ఉద్యోగులు కేవలం క్రింది సమయాల్లోనే మరుగుదొడ్డిని ఉపయోగించుకోవచ్చు. ఇక సమ్యల విషయానికి వస్తే.. ఉదయం 8 గంటల ముందు, ఉదయం 10:30 నుండి 10:40 మధ్య, మధ్యాహ్నం 12 నుండి 1:30 మధ్య, మధ్యాహ్నం 3:30 నుండి 3:40 మధ్య, సాయంత్రం 5:30 నుండి 6:00 మధ్య మాత్రమే ఉపయోగించాలి. అయితే, ఓవర్‌టైమ్ పని చేస్తున్న ఉద్యోగులకు రాత్రి 9 గంటల తరువాత మాత్రమే మరుగుదొడ్డు వినియోగానికి అనుమతి ఉంటుంది. ఈ సమయాల వెలుపల అత్యవసర అవసరం అయితేనే టాయిలెట్ ఉపయోగించుకోవచ్చు. అయినా, రెండు నిమిషాల్లోపు ముగించాలి. లేదంటే వారిపై చర్యలు తీసుకోనున్నారు.
ఈ నిర్ణయానికి న్యాయబద్ధత చూపేందుకు, కంపెనీ హువాంగ్ డి నెయి జింగ్ అనే 2,000 సంవత్సరాల పురాతన చైనీస్ మెడిసిన్ గ్రంథాన్ని ఉదహరించింది. ఇది చైనాలో ప్రాచీన వైద్యానికి మూలగ్రంథంగా పరిగణించబడుతుంది. కంపెనీ ప్రకారం, ఈ నియమాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. కంపెనీ మరుగుదొడ్ల వినియోగానికి మరింత కఠినమైన ఆంక్షలను కూడా విధించింది. అవేంటంటే.. కొన్ని గంటలపాటు టాయిలెట్ పూర్తిగా నిషేధం అమల్లో ఉంటుంది. ఇంకా ఏవైనా ఆరోగ్య కారణాల వల్ల మరుగుదొడ్డికి వెళ్లాల్సిన ఉద్యోగులు HR అనుమతి తీసుకోవాలి. అలా వెళితే టాయిలెట్‌లో గడిపిన సమయానికి వేతనంలో కోత విధించనున్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినవారికి 100 యువాన్ జరిమానా విధించనున్నారు. ఈ విధానం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమల్లో ఉంది. మార్చి 1 నుండి పూర్తిస్థాయిలో అమలుకానుంది.
Read Also: PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్‌క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు
చైనా గ్వాంగ్‌డాంగ్ యీయూ లా ఫర్మ్ న్యాయవాది చెన్ షిసింగ్ ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియమాలు కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. చట్టప్రకారం, ఉద్యోగ నిబంధనల్లో ఏ మార్పు అయినా కార్మికుల లేదా వారి ప్రతినిధుల అంగీకారంతోనే అమలు చేయాలని తెలిపారు. అలాగే, ఈ నియమాలు ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు. మొత్తానికి త్రీ బ్రదర్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని, హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటే, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.