NTV Telugu Site icon

Veera Raghava Reddy : రామరాజ్యం ఆర్మీ వీర రాఘవరెడ్డి అరెస్టు..

Veera Raghava Reddy

Veera Raghava Reddy

Veera Raghava Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు ఆయనపై దాడి చేయడంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీర రాఘవ రెడ్డి, రామరాజ్యం అనే ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రామరాజ్యం స్థాపన కావాలని ప్రచారం చేస్తున్న అతడు, పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వచ్చాడు. అతని ఆర్మీలో చేరాలంటే, 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం, 2 కిలోమీటర్లు పరిగెత్తగల సామర్థ్యం ఉండాలి, అలాగే వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. సభ్యులకు నెలకు రూ. 20,000 జీతం అందిస్తానని అతను చెప్పి యువతను ఆకర్షిస్తున్నాడు.

 Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

వీర రాఘవ రెడ్డి తన రామరాజ్యం సైన్యంలో చేరాలని అర్చకుడు రంగరాజన్‌పై ఒత్తిడి చేశాడు. రంగరాజన్ దానికి నిరాకరించడంతో, ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద సంఖ్యలో రంగరాజన్ ఇంటికి వెళ్లి రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని, ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో అతనిపై తీవ్రంగా దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన అతని కుమారుడిపై కూడా హింసకు పాల్పడ్డారు.

దాడికి ముందు, వీర రాఘవ రెడ్డి అనుచరులు రంగరాజన్‌ను “తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో తమ గోత్రానికి చెందినవారిని గుర్తించకుండా ఎలా పని చేస్తున్నారని” ప్రశ్నించారు. కోర్టు కేసుల గురించి చులకనగా మాట్లాడి, “ఉగాది వరకు గడువు ఇస్తున్నాం, రామరాజ్యం స్థాపనకు సహకరించకపోతే మళ్లీ వస్తాం, వచ్చేవారు వచ్చి పని చేసుకుని వెళతారు” అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.

పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడైన వీర రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసి, అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. గతంలో హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలోనూ వీర రాఘవ రెడ్డి పై దాడి కేసు నమోదైనట్టు సమాచారం. ఈ ఘటన ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. రంగరాజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆలయ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

Valentines Day: మీ లవర్‌కి స్మార్ట్ గాడ్జెట్స్‌తో బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? వీటిపై ఓ లుక్కేయండి