Site icon NTV Telugu

Child Digital Addict: మితిమీరిన స్క్రీన్ టైం.. పిల్లల ఆరోగ్యంపై పెను ప్రభావం! సర్వేలో కీలక విషయాలు..

Child Digital Addict: నేటి ఆధునిక కాలంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు బానిసలవ్వడం ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోందని తాజాగా ఎకనామిక్ సర్వే (Economic Survey) వెల్లడించింది. దీనిని నియంత్రించడానికి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సర్వే ప్రకారం.. మితిమీరిన స్క్రీన్ సమయం (Screen Time) పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో సోషల్ మీడియా వ్యసనం వల్ల ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression), సైబర్ బెదిరింపు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ‘గేమింగ్ డిజార్డర్’ను ఒక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించింది.

నియంత్రణకు సూచనలు:
పిల్లలను ఈ డిజిటల్ ఊబి నుండి బయటపడేయడానికి సర్వే కొన్ని కీలక పరిష్కారాలను ప్రతిపాదించింది. అవి ఇలా ఉన్నాయి.

వయస్సు నిర్ధారణ: ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కచ్చితమైన వయస్సు నిర్ధారణ ప్రక్రియను అమలు చేయాలి.

విద్యాపరమైన పరికరాలు: పిల్లలకు వినోదం కంటే కేవలం చదువుకు ఉపయోగపడే సాధారణ పరికరాలను (Simpler devices) అందించాలి.

డిజిటల్ వెల్నెస్: పాఠశాలల్లో ‘డిజిటల్ వెల్నెస్’ను పాఠ్యాంశంగా చేర్చాలి.

ప్రత్యామ్నాయాలు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత కోసం ఫిజికల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ హబ్‌లను ఏర్పాటు చేయాలి.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) ముప్పు:
డిజిటల్ వ్యసనంతో పాటు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, ప్యాక్డ్ స్నాక్స్ మొదలైనవి) కూడా పిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని సర్వే పేర్కొంది. వీటిపై అధిక పన్నులు విధించాలని, పిల్లలకు సంబంధించిన మీడియాలో ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు వీటి ప్రకటనలను నిషేధించాలని సూచించింది.

తల్లిదండ్రుల పాత్ర:
కేవలం ప్రభుత్వాలే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా పిల్లల స్క్రీన్ సమయంపై నిఘా ఉంచాలి. ఇంట్లో డివైజ్ ఫ్రీ సమయాన్ని కేటాయించాలని, పిల్లలతో కలిసి ఆఫ్-లైన్ యాక్టివిటీస్‌లో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version