Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్‌ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!

Sammakka Sagar Barrage: తెలంగాణలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కలిశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, మిగిలిన అనుమతుల ప్రక్రియలోనూ సహకరించాలని కోరారు.

సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో పాటు, 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అంచనా వేశారు. దీంతో ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం.. పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయి. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని నివేదికలో పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది.

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను వినియోగించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడేలా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.