Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Chhatrapati Sambhajinagar

Chhatrapati Sambhajinagar

Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఐఫోన్ కోసం ఓ యువకుడు కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే కథనాన్ని మనం చదివే ఉంటాం. ఈ ప్రమాదంలో తండ్రి, తరువాత తల్లి సైతం లోయలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ యువకుడు ఐఫోన్ కోసం ఆత్మహత్యకు పూనుకోలేదని తేలింది. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ ఘటన వెనుక ఉన్న అసలైన నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఏం జరిగిందంటే..?

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అత్యంత గుండెకోతకు గురిచేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఖువాడియా కొండ పైనుంచి పడి మురళీధర్‌, ఆయన భార్య సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్‌లతో కూడిన చాంద్‌గుడే కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. కొండపై ఉన్న కొడుకుని రక్షించేందుకు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తూ తండ్రీకొడుకులు జారిపడగా, ఆ దారుణాన్ని కళ్లారా చూసిన తల్లి కూడా అక్కడికక్కడే కొండపై నుంచి దూకేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో క్లాసులకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కునాల్, ఉదయం 9.10 గంటలైనా ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకోలేదు. దీంతో యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించగా, మొబైల్ లోకేషన్ ఆధారంగా అతడు ఖువాడియా కొండపై ఉన్నట్లు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. కొండచివర నిలబడి పదే పదే స్థానాలు మారుస్తున్న కునాల్‌ను కిందకు రావాలని అధికారులు సుదీర్ఘంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ముందస్తు జాగ్రత్తగా కింద సేఫ్టీ నెట్ కూడా ఏర్పాటు చేశారు.

అయితే కొడుకుని కాపాడుకోవాలనే ఆరాటంతో తండ్రి మురళీధర్‌ అతనికి దగ్గరగా వెళ్లి చేయి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ ఒక్కసారిగా 300 అడుగుల లోతైన రాతి లోయలోకి జారిపడిపోయారు. కళ్లెదుటే భర్త, కొడుకు పడిపోవడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగీత.. క్షణాల వ్యవధిలోనే కొండపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఒక అగ్నిమాపక సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. తొలుత ఐఫోన్ కోసం కునాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడని వార్తలు వచ్చాయి. కానీ.. తాజాగా బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదాలు, మనస్పర్థలు నడుస్తున్నాయి. పదో తరగతిలో 82 శాతం మార్కులు సాధించి, భవిష్యత్తులో MBBS చదవాలని కలలుకంటున్న కునాల్, తన తల్లిదండ్రులను ఎలాగైనా కలిపి ఉంచాలని ఆరాటపడేవాడని తల్లి వైపు బంధువులు పేర్కొన్నారు. మరోవైపు, మురళీధర్‌ దంపతులు 22 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని, ఆ పెళ్లికి పెద్దల ఆమోదం లేకపోవడంతో కుటుంబ సంబంధాలు సరిగ్గా లేవని మురళీధర్‌ సోదరి శోభ తెలిపారు. అయితే, నాలుగు నెలల క్రితమే అద్దెకు వచ్చిన ఈ కుటుంబంలో ఎలాంటి గొడవలు తాము చూడలేదని, మురళీధర్‌ 10 ఏళ్లుగా క్రమశిక్షణ కలిగిన డ్రైవర్‌గా పనిచేస్తున్నారని పొరుగువారు, సహద్యోగులు వెల్లడించారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ సమాచారంతో ఈ చావులకు కారణం ఐఫోన్‌ కాదని తెలుస్తోంది.