Chevella Tragedy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ (ఖానాపూర్ స్టేజీ) సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది ప్రాణాలను కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం తీవ్రతకు బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం కూడా బోల్తాపడటంతో ఇరు డ్రైవర్స్ అక్కడికక్కడే మృతి చెందారు.
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దాదాపు 20 మంది మృతి
ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బలమైన దెబ్బకు బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు కంకర కింద ఇరుక్కుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు అంబులెన్సులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రమాదం జరిగిన రోడ్డులో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అంబులెన్స్‌లు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఘటనాస్థలానికి చేవెళ్ల పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎం సీఎస్ (ప్రధాన కార్యదర్శి), డీజీపీ లకు ఫోన్ చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సాయం, అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని, అందుబాటులో ఉన్న మంత్రులను సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అన్ని రకాల సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Ilaiyaraaja: 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్!
అదేవిధంగా.. ఈ ఘోర ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ఆయన, మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని ఆయన ఆదేశించారు.
