Site icon NTV Telugu

Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ కావాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన మాజీ దిగ్గజం!

Team India Coach

Team India Coach

కొన్నిసార్లు గట్టిగా మాట్లాడేవారి కంటే.. నిశ్శబ్దంగా పోరాడే వారే చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వ్యక్తే ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా. ఏనాడూ స్లెడ్జింగ్‌లో పాల్గొనలేదు, సోషల్ మీడియాలో ఏనాడూ అతడికి వ్యతిరేకంగా వార్తలు రాలేదు. ప్రశాంతతకు మారుపేరైన పుజారా.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ బ్యాట్‌తో అండగా నిలబడ్డాడు. రాజ్‌కోట్ వీధుల నుంచి మెల్‌బోర్న్, జోహన్నెస్‌బర్గ్ వరకు ప్రతి మైదానంలో రన్స్ చేశాడు. ఆసీస్ పర్యటనలో శరీరానికి బంతులు తగిలినా.. జట్టు కోసం క్రీజులో నిలబడ్డాడు. టీమిండియా కోసం ఎంతో చేసిన అతడు కొత్త బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు.

ఇటీవలే అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి రిటైర్ అయిన చతేశ్వర్ పుజారా మరలా జట్టులో చేరాలని కోరుకుంటున్నాడు. అయితే ఈసారి భిన్న పాత్రను పోషించాలనుకుంటున్నాడు. ‘న్యూస్ 18’తో మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీమిండియా కోచింగ్ బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవడానికి రెడీగా ఉన్నానని పుజారా తెలిపాడు. తాను జట్టు బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బీసీసీఐకి పుజారా సూటిగా చెప్పేశాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ పదవిలో ఉన్నాడు. గంభీర్ అనంతరం బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట మొదలెడుతుంది. అప్పుడు బోర్డు పుజారాపై ఆసక్తి చూపుతుందో లేదో.

Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. తెలుగోడు తిలక్ వర్మపై వేటు తప్పదా?

103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన చతేశ్వర్ పుజారా 7000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దేశం కోసం ఒక రోజంతా క్రీజులో గడిపి అనేక గాయాల పాలైన పుజారా.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉండటమే కోచ్ కావడానికి అతిపెద్ద లక్షణం. అతని అనుభవం జట్టుకు కచ్చితంగా ఉపయోగపడనుంది. భారత్ తరఫున 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు బాదాడు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన అతడు వన్డేల్లో మాత్రం రాణించలేకపోయాడు. టెస్టుల్లో 7195, వన్డేల్లో 51 రన్స్ చేశాడు.

Exit mobile version