Chess Player Magnus Carlsen Said I played game while drunk: ‘మాగ్నస్ కార్ల్‌సెన్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్వేకు చెందిన కార్ల్‌సెన్ ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, ఐదుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఏడుసార్లు ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను 2013లో ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ మరుసటి సంవత్సరం ఆనంద్‌పై తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. అక్కడి నుంచి కార్ల్‌సెన్ ప్రభంజనం మొదలైంది. మేటి చెస్ ప్లేయర్ అయిన కార్ల్‌సన్ తాజాగా సంచలన విషయాలు పంచుకున్నాడు.
మాగ్నస్ కార్ల్‌సన్ ఇటీవల లై డిటెక్టర్ టెస్ట్ (సత్యశోధన పరీక్ష)లో పాల్గొన్నాడు. చెస్ వ్యాఖ్యాత, గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ హోవెల్ అడిగిన ఇబ్బందికర ప్రశ్నలకు కార్ల్‌సన్ చకచకా సమాధానం ఇచ్చాడు. కార్ల్‌సన్ చెప్పిన సమాధానాలు తప్పో ఒప్పో అని పాలీగ్రాఫ్ నిపుణుడు ఒర్జాన్ హెస్‌జెదాల్ చెక్ చేశాడు. కార్ల్‌సన్ చెప్పిన సమాధానాలు అన్ని సరైనవే అని పాలీగ్రాఫ్ నిపుణుడు పేర్కొన్నాడు. కార్ల్‌సన్‌తో హోవెల్ చెస్ ఆడుతూ అడిగిన ప్రశ్నలకు సంబందించిన వీడియోను మంగళవారం నాడు ‘చెస్ డాట్‌కామ్’ పోస్ట్ చేసింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడనందుకు చింతిస్తున్నావా అని చెస్ వ్యాఖ్యాత డేవిడ్ హోవెల్ అడగ్గా.. లేదని మాగ్నస్ కార్ల్‌సన్ సమాధానం ఇచ్చాడు. అతడు నిజమే చెబుతున్నాడని పాలీగ్రాఫ్ నిపుణుడు ఒర్జాన్ హెస్‌జెదాల్ చెప్పాడు. కెరీర్‌లో అత్యంత ఇబ్బందికర సందర్భం ఏదైనా ఉందా అని అడిగితే.. ఓసారి ప్యాంట్లో మూత్రం పోసుకున్నా అని చెప్పాడు. అంతేకాదు చెస్ బోర్డుపై నీళ్లు చల్లా అని, పావులను పడేశా అని కార్ల్‌సన్ తెలిపాడు. ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ ఈసారి టైటిల్‌ను నిలబెట్టుకుంటాడని నువ్ భావిస్తున్నావా? అన్న ప్రశ్నకు.. నో అని కార్ల్‌సన్ జవాబిచ్చాడు.